🍁 లంకాధీశ్వరుడైన రావణుడు శివభక్తులలో అగ్రగణ్యుడు. అతడు హిమాలయాలకు వెళ్లి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు 'పరమేశ్వరా! నువ్వు నా లంకానగరానికి వచ్చి, అక్కడ నిత్య నివాసం చెయ్యి' అని కోరాడు.
🍁 శివుడు తన ప్రతీక అయిన ఆత్మలింగాన్ని అతనికి ప్రసాదించి, 'ఈనా ఆత్మలింగాన్ని ఎక్కడ ప్రతిష్టించితే, నేను అక్కడ ఉంటాను. దీనిని తీసుకుపో! లంకానగరం చేరే వరకు పొరబాటుగానైనా దీనిని కింద పెట్టకు. ఇది కిందపడితే, మళ్లీ లేవనెత్తటం అసాధ్యం' అని హెచ్చరించాడు.
🍁 ఈ విషయం తెలిసి దేవతలు హడలి పోయారు. శివుడికి లంకలో నిత్యనివాసం ఏర్పడితే, రావణాసురుణ్ణి జయించే వాళ్లు ఎవరూ ఉండరు. లంకమీదికి దండెత్తే సైన్యాలను శివుడే చంపుతాడు. కనుక ఆత్మలింగం లంకకు చేరటం దేవతలకు ఇష్టంలేక పోయింది. ఈ ఆపద తొలగటానికి వాళ్లు గణపతిని పూజించారు.
🍁 గణపతి తన మాయతో రావణుని మార్గంలో మనుష్యులెవరూ లేకుండా చేసి తాను గోప బాలకుడి వేషంలో వెళ్లి సముద్రతీరంలో ఒక చోట పశువులను మేపుకోసాగాడు. ఆత్మలింగాన్ని చేత బట్టుకొని రావణుడు అక్కడికి రాగానే, సాయంకాలమైంది.
🍁 రావణుడు బ్రహ్మజ్ఞాని. త్రిసంధ్యలలోను సంధ్యవార్చుకొనే నియమం కలవాడు. ఆత్మలింగాన్ని కిందపెట్టి వెళ్లి సంధ్య వార్చుకోవటం కుదరదు కనుక, సహాయం కోసం చుట్టూ చూడగా, గోప బాలకుడు అతనికి కానవచ్చాడు.
🍁 రావణుడు అతన్ని పిలిచి కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని, తాను సంధ్యవార్చి తిరిగి వచ్చేవరకు కిందపెట్టవద్దనీ చెప్పాడు.
గణపతి దానిని తీసుకొని 'ఇది చాలా బరువుగా ఉంది. దీనిని మోసుకొని ఉండటం నాకు కష్టమైపోతే మూడుసార్లు నిన్ను పిలుస్తాను. ఆలోగా వచ్చి దీనిని అందుకో. నువ్వు రాకపోయావో తప్పు నాది మాత్రం కాదు' అన్నాడు.
🍁 రావణుడు అందుకు సమ్మతించి, సముద్ర స్నానానికి వెళ్లాడు. అతడు సంధ్య వార్చుకోక ముందే గణపతి 'రావణా! త్వరగారా!' అంటూ మూడుసార్లు పిలిచాడు.
రావణుడు, 'ఇదిగో వచ్చేస్తున్నాను' అంటుండగానే గణపతి 'ఇక నావల్లకాదు, అని చెప్పి, లింగాన్ని భూమిపైన పెట్టి మాయమయ్యాడు.
🍁 రావణుడు పరుగు పరుగున వచ్చి, భూమిలో కూరుకుపోయిన లింగాన్ని లేవనెత్తటానికి విశ్వప్రయత్నం చేశాడు. అతని బలానికి భూమి కంపించింది కానీ ఫలితం మాత్రం లేకపోయింది.
🍁 తన ప్రయత్నమంతా నిష్ఫలమైనందుకు రావణుడు దుఃఖించి, ఆకాశవాణి ప్రబోధం మేరకు, అక్కడొక తటాకాన్ని నిర్మించి, సకల తీర్థాలలోని పవిత్ర జలాలను అందులోకి రప్పించి, ఆ జలాలతో లింగాన్ని అభిషేకించి, పూజించి, లంకకు మరలివెళ్లాడు.
🍁 అతని ప్రయత్నం భగ్నం అయినందుకు దేవతలంతా సంతోషించారు.
Tags
Devotional