అతి ఏదైనా అనర్థమే. మితం
పరిమితం అలవాటు చేసుకుంటే జీవితం సంతోషదాయకం, ఆరోగ్యకరం. ప్రతి ఒక్కరూ అందంగా,
నాజూగ్గా ఉండాలనిఅనుకోవడం సహజం. లావుగా అవుతున్నామని
భావించి శరీరానికి అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం మానేస్తుంటారు. తూకమేసి తినడం.. కొలుచుకొని తాగడం.. అంతా మితం పరిమితం.
అర్ధాకలికి తట్టుకోలేక.. ప్రాణం ఆగక ఓ ముద్ద
ఎక్కువ తింటే ఎన్ని కిలోల
బరువు పెరుగుతామో అనే ఆందోళన. అయితే
తగినంతగా ఆహారం లేకపోతే, శరీరానికి
కావలసిన పోషకాలు లభించకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బరువు
తగ్గాలనే ఆతురతతో కొందరు ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుంటారు. అలా చేయడం వల్ల
ప్రొటీన్లు, కొన్ని రకాల అవసరమైన కొవ్వుపదార్థాలు,
విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు సరిపడా
అందవు. దానివల్ల శరీరం బలహీనంగా అయిపోతుంది.
అందుకే బరువు తగ్గడం కోసం
ఆరోగ్యకరమైన విధానాన్ని పాటించడం చాలా ముఖ్యం. స్లిమ్గా ఉండాలంటే డైటింగ్
చేయకూడదు. ఆహారపు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బరువు కూడా కంట్రోల్
అవుతుంది.
ఒకే సారి అధికంగా తినడం
కంటే, నాలుగు సార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది. భోజనం
చేస్తూ మధ్యలో అతిగా నీళ్లు తాగకూడదు.
దాని వల్ల పొట్ట పెరుగుతుంది.
ఆకు కూరలు, పాలు, క్యారెట్, నిమ్మ,
ఉసిరి, టమాటా మొదలైన విటమిన్స్ లభించే అన్నింటిని ఆహారంలో తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు, పులుపు, నూనెల వాడకం బాగా
తగ్గించాలి. సాధ్యమైనంత వరకు స్వీట్లు, కొవ్వు
పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రోజూ కనీసం ఎనిమిది
గ్లాసుల నీళ్లు తాగాలి.
Tags
Health & Fitness